పడమటి దిక్కున వరదగుడేసే…
ఉరుముల మెరుపుల వానలు కురిసే…
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా…
మన రైతన్నలు వ్యవసాయ పనులు ప్రారంభించే ఏరువాక పూర్ణిమ జూన్ 11న వస్తోంది. ఏరువాక సందర్భంగా రైతులందరూ పశువులను, వ్యవసాయ పనిముట్లను కడిగి, అలంకరించి పూజిస్తారు. విత్తనాలు చల్లడానికి వీలుగా నేలను దున్నడం ఏరువాక పున్నమినాడే మొదలుపెడతారు. నైరుతి ఋతుపవనాలు అనుకూలించాలని, మన రైతన్నల కృషి చక్కగా ఫలించాలని కోరుకుందాం. పంటలు బాగా పండి సస్యసమృద్ధి కలగాలంటే నీరు కావాలి. జీవకోటికంతటికీ ప్రాణాధారం జలమే. భారతదేశంలో నీటిని మనం గంగగా సంభావిస్తాం. అటువంటి గంగాజయంతి జూన్ 5వ వస్తోంది. పదిరకాలైన పాపాలను కడిగివేసే శక్తి గంగకు ఉందంటారు. అందువల్లనే గంగాజయంతిని దశపాపహర దశమిగా కూడా పిలుస్తారు. గంగామాత అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిద్దాం.
Click Here For June 2025 Bhakthi Magazine Online Edition
ప్రపంచానికి భారతదేశం అందించిన దివ్యమైన కానుక యోగశాస్త్రం. పతంజలి కాలం నుంచి యోగశాస్త్రం అనేక మార్గాల్లో విస్తరించింది. నేడు విశ్వవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ యోగదినోత్సవం (జూన్ 21) సందర్భంగా నేటికాలపు అనారోగ్యాలకు యోగశాస్త్రం అందించే పరిష్కారాలను పరిశీలిద్దాం. మన పెద్దలు ‘సర్వం జగన్నాథం’ అంటారు. అంటే పూరీ జగన్నాథుడు. భేదభావాలు లేని దేవుడు అని తాత్పర్యం. ఒడిశాలోని పూరీ క్షేత్రంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ రథోత్సవం జూన్ 27న నిర్వహిస్తారు. అభీష్టాలను ప్రసాదించమని జగన్నాథుని వేడుకుందాం. ఈ నెలలోనే 26న తెలంగాణ జనజాతర బోనాలు ప్రారంభమవుతున్నాయి. అమ్మతల్లులు మనల్ని అన్ని రోగాలనుంచి కాపాడి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా
జూన్ అంటేనే కొత్త విద్యాసంవత్సరానికి ప్రారంభమాసం. మన చిన్నారుల విద్యాభ్యాసం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆ చదువుల తల్లి సరస్వతీదేవిని ప్రార్థిద్దాం.
Tirumala Srivari Arjitha Seva : తిరుమల శ్రీవారి సేవ కోసం.. టీటీడీపై కోర్టులో పోరాడి గెలిచిన భక్తుడు
➠ పతి క్షేమం, పిల్లల సంక్షేమం కోరుతూ మగువలు వటసావిత్రి వ్రతం చేస్తారు. యముని బారి నుంచి భర్త ప్రాణాలను ఎంతో పట్టుదలతో కాపాడుకున్న సావిత్రిని భక్తి పూర్వకంగా కొలుస్తూ ఈ ఆచరిస్తారు. వట సావిత్రి వ్రతానికి సంబంధించిన పూజను సామూహికంగా గానీ, వ్యక్తిగతంగా గానీ నిర్వహించుకోవచ్చు.
➠ నేను జగన్నాథుడిని. ఈ జగత్తనే మాయా నాటకాన్ని నడిపిస్తున్నవాడిని నేనే. కృష్ణావతారం ముగించిన తరువాత… పూరీ క్షేత్రంలో దారు బ్రహ్మగా స్థిరపడ్డాను. ఓడ్ర భూమిలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా తలుచుకునేది.. పూజించేది నన్నే. వారికి నేనే సర్వస్వం. మీకు తిరుమల శ్రీవేంకటేశ్వరుడు, తమిళులకు శ్రీరంగనాథుడు, గుజరాతీలకు ద్వారకాధీశుడు ఎలాగో… ఒడిశావాసులకు నేను అంతటి ప్రీతిపాత్రం. ఒడిశాలో నా ఆలయం లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు.
➠ ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణ నేలపై బోనాల సంబురాలు మొదలవుతాయి. నెత్తిన బోనం కుండలతో, ఘటాలతో…. పోతురాజుల విన్యాసాలతో, ఫలహారపు బళ్లతో భాగ్యనగర వీధులన్నీ కళకళలాడుతాయి. తల్లీ బైలెల్లినాదో… చల్లంగ మమ్మేలు మాయమ్మో… అంటూ జానపదుల పాటలు హుషారెత్తిస్తాయి. వర్షకాలంలో వచ్చే మహమ్మారుల నుంచి కాపాడమని జగన్మాతకు బోనాలు సమర్పిస్తారు. పంటలు వృద్ధి చెందాలని, ప్రతి ఇల్లు పిల్లాపాపలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్రతి ఆదివారం బోనాల పండుగ చూసేవారికి చూడవేడుకగా సాగుతుంది.
➠ అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో నీలాచల పర్వతంపై ఉంది. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సతీదేవి యోనిభాగం పడ్డ ప్రదేశం కనుక దీనిని సృష్టికి మూల కారణమైన స్థానంగా భావిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబుబాచి మేళా జరుగుతుంది.
➠ శ్రమైక జీవన సౌందర్యానికి నెలవైన ఏరువాక పూర్ణిమ విశేషాలు వేదకాలం నుంచి జానపదం దాకా అనేకం ఉన్నాయి. ఏరువాక పున్నమినాడు రైతన్నలు పశువులను, వ్యవసాయ పరికరాలను భక్తిశ్రద్ధలతో పూజించి పొలం దున్నేందుకు సిద్దమవుతారు. ప్రతి ఒక్కరి కడుపునింపే వరిగింజ పండాలంటే దానికి ఏరువాకే తొలిసాధనం. అందుకే ఈ పండుగకు రైతు అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు. మనమూ మన అన్నదాతల సంక్షేమాన్ని కోరుకుందాం.
➠ యోగశాస్త్రం ప్రపంచానికి అందించిన అద్భుత ఆధ్యాత్మిక సంపద. యోగశాస్త్రాన్ని గురించి ఋగ్వేదంలో ప్రస్తావనలున్నాయి. ఉపనిషత్తులు, భగవద్గీత యోగాభ్యాసకులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. త్రిమూర్తులలో లయకారకుడైన పరమశివుడిని ఆదియోగిగా భావిస్తారు. అనేకమంది యోగులు యోగాభ్యాసాన్ని వివిధ పద్ధతులలో ఆవిష్కరించారు. అన్నింటిలోనూ గీతాశాస్త్రాన్ని అనుసరిస్తూ యోగాభ్యాసం చేయడం అత్యుత్తమ విధానంగా నేటికీ చలామణీలో ఉంది.
➠ మనం ఏ పని చేయాలన్నా మూడు పనిముట్లు కావాలి. అవే వాక్కు, మనస్సు, కాయము. వీటినే త్రికరణాలు అంటారు. త్రికరణశుద్ధిగా చేసిన పని మంచి ఫలితాలనిస్తుంది. అలాగే చెడ్డపని చెడ్డఫలితాలను ఇస్తుంది. మనోవాక్కాయ కర్మల చేత మనం తెలిసి, తెలియక చేసే పదిరకాలైన పాపాలు లేదా దోషాలను తొలగించేందుకు మార్గం ఏమిటి? అంటే… గంగాస్నానం అని ఋషులు చెప్పారు. జ్యేష్ఠ శుద్ధ దశమి గంగాజయంతి సందర్భంగా గంగాస్నానం చేసేవారు ధన్యులు.
➠ చదువంటే అక్షరాల జ్ఞానం మాత్రమే కాదు. ఆ అక్షరాల వెనుక ఉన్న అనంతమైన భావాలను అందిపుచ్చుకోవటం. చదువంటే పట్టా (సర్టిఫికెట్)లతో పట్టే కుస్తీ ఆట కాదు. పట్టుబడని విజ్ఞాన రహస్యాల అంతుపట్టుకోవటం. చదువంటే ఉద్యోగం కోసం చేసే ప్రయ్నతం కాదు. ఉన్నతమైన వ్యక్తిగా ఎదగటం కోసం చేసే సాధన. చదువంటే జీవితంలో ఓ దశ కాదు. జీవితాంతం మన వెంట ఉండే అక్షరశక్తి. చదువంటే పేరు పక్కన రాసుకునే అక్షరాలు కాదు. మన కీర్తిని శాశ్వతం చేసే విలువల నిధి.
ఇలా అనేక అంశాలతో జూన్ ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది. కొన్న వారికి తక్షణమే తమ DASHBOARD లోకి పత్రిక వచ్చేస్తుంది. అందులోని పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. మన సేవలను అందుకుని ఆ దేవతలందరూ మనందరికీ ఆయురారోగ్యాలను, సకల శుభాలను కలిగించాలని వేడుకుందాం.
ఇక్కడ క్లిక్ చేయండి.. జూన్ ఆన్లైన్ భక్తి పత్రికను పొందండి..!