ప్రతి మనిషి జీవితంలోనూ వివాహమనేది అతి ముఖ్యమైన ఘట్టం. చాలా మందికి ఎన్ని సంబంధాలు చూసినా కూడా వివాహం సెట్ అవదు. పెళ్లి కోసం జాతక దోషమని.. మరింకేదో అని ఏవేవో పూజలు, శాంతులు చేస్తుంటారు. అయితే ఒక దేవాలయాన్ని సందర్శిస్తే తప్పక వివాహం జరుగుతుందట. ఆ ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లా కుట్టాలమ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కావేరీ నదీ తీరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇంతకీ ఈ ఆలయం ఎవరిదంటారా? పార్వతీ పరమేశ్వరులది.
పార్వతీపరమేశ్వరులిద్దరూ కలిసి కనిపించడం చాలా అరుదుగానే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు పాణి గ్రహణ సమయంలో వధూవరులు ఎలా చేతిలో చేయి వేస్తారో అలా దర్శనమిస్తారట. దీనిని పార్వతీపరమేశ్వరుల వివాహం జరిగిన పవిత్ర ప్రాంతంగా అక్కడి వారు నమ్ముతారట. అందుకే పెళ్లి కాని వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పక పెళ్లవుతుందని నమ్మకం. ఇక్కడి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏడాది తిరిగే సరికి పెళ్లి పక్కాగా అవుతుందట.