ఈ అమ్మవారికి నిమిషంలో కోరిక చెబితే.. 21 నిమిషాల్లో నెరవేరుతుంది.. ఎవరీ అమ్మవారు? ఎక్కడుందీ ఆలయం?

ఆ అమ్మవారికి మన కోరికను నిమిషంలో చెప్పాలట. అది చెప్పిన 21 నిమిషాల్లో మన కోరిక నెరవేరుతుందట. ఇంతకీ ఎవరా అమ్మవారు? ఎక్కడుంటారో చూద్దాం. అమ్మవారి పేరు నిమిషాంబిక. హైదరాబాద్ బోడుప్పల్‌లో పెంటారెడ్డి కాలనీలో అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 2006లో ప్రతిష్టించారు. ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా అమ్మవారిని అనుకోకుండా ప్రతిష్టించారట. ఈ స్థలంలో మరో విశేషం ఏంటంటే.. విఘ్నేశ్వరుడు నైరుతి భాగంలో ఉండటం. ఆగ్నేయభాగంతో ఉత్తరాభిముఖంగా ఉండటంతోనే ఆమెకు నిమిష అంబిక అనే పేరు వచ్చింది. అమ్మవారు పార్వతి, దుర్గమ్మ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారి ధ్వజస్తంభం దగ్గరకు వెళ్లి ఒక్క నిమిషంలో కోరిక కోరుకోవాలి. అనంతరం 16 ప్రదిక్షణలు చేయాలి.

అలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో పార్వతీ, దుర్గామాత కరుణ మనపై ఉంటుందని అక్కడి పూజారులు చెబుతుంటారు. అలాగే ప్రదక్షిణ చేస్తున్న సమయంలో గణేశుడి వీక్షణ మనపై పడుతుందని.. తద్వారా మన విఘ్నాలన్నీ తొలగిపోయి మన కోరిక 21 నిమిషాల్లో లేదంటే 21 రోజుల్లో మన కోరిక తప్పక నెరవేరుతుందట. ఇక నవరాత్రుల్లో అయితే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ శివకేశవులు ఇద్దరూ ఉంటారు.జేష్ట శుద్ధ ద్వాదశి నాడు అమ్మ వారిని ప్రతిష్టించిన రోజు కావడంతో ఆ రోజున అందరూ చూస్తుండగా అభిషేక కార్యక్రమం ఉంటుంది. కార్తీక మాసంలో విశేష దీపాలంకరణ ఉంటుంది. దీప ప్రజ్వలన చూసేందుకు రెండు కళ్లూ చాలవట. దీనిని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. దీనిని చూస్తే చాలు మన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

Share this post with your friends