అయోధ్య అనగానే మనకు శ్రీరాముడు గుర్తొస్తాడు. రాముడు నడయాడిన నేల కావడంతో ఆ ప్రాంతాన్ని దేశం యావత్తు సాకేతపురిని పవిత్ర ప్రదేశంగా భావిస్తూ ఉంటుంది. అక్కడ రామమందిర నిర్మాణంతో దేశం మొత్తం ఆనందంతో పులకించి పోయింది. బాలరామయ్య విగ్రహ ప్రతిష్టతో మరింత ఆనందం వెల్లివిరిసింది. అయితే అయోధ్యలో మరో విశేషం కూడా ఉంది. ఇక్కడ ఒక బ్యాంకు ఉంది. ఈ బ్యాంకు పేరు ఇంటర్నేషనల్ సీతారామ్ బ్యాంక్. ఈ బ్యాంకు ప్రత్యకత చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
సీతారామ బ్యాంకులో ఖాతా తెరవాలంటే డబ్బు ముఖ్యం కాదు.. సీతారాం అని 5 లక్షల సార్లు రాయాలి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ భక్తులు రాముడి పేరిట రుణం పొందుతారు. 1970లో స్థాపించబడిన ఈ బ్యాంకులో 35 వేల మంది ఖాతాదారులున్నారు. మరో ఆసక్తికర న్యూస్ ఏంటంటే ఆ ఖాతాదారులందరూ ఏ అయోధ్యకో.. లేదంటే ఉత్తరప్రదేశ్‌కో మాత్రమే చెందిన వారు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా దీనికి ఖాతాదారులున్నారు. ఈ బ్యాంకుకు అమెరికా, బ్రిటన్, ఫిజీ, యూఏఈ, నేపాల్, కెనడా దేశాలకు చెందిన వారు ఖాతాదారులుగా ఉన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రయోజనం కూడా ఈ బ్యాంకుదే కావడం విశేషం.