కార్తీక మాసంలో దీప దానం చేయడం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటాం. మనం చేసిన సకల పాపాలన్నీ తొలగిపోయి జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతల నుంచి విముక్తి లభిస్తుందట. ప్రతి పనిలో అనుకూలత లభించి సకల మనోభీష్టాలు నెరేవేరుతాయి. అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలుసుకున్నాం. ఆలయాల్లో దీప దానం చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని తెలుసుకున్నాం. మరి ఇన్ని ప్రయోజనాలను చేకూర్చే దీప దానాన్ని ఎలా పడితే అలా చేయకూడదు. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
దీపదానం చేయాలనుకునే వారు ఉదయాన్నే లేచి శుచిగా స్నానమాచరించి సమీపంలోని శివాలయానికి కానీ విష్ణువు ఆలయానికి కానీ వెళ్లాలి. రెండు మట్టి ప్రమిదలు కానీ, వెండి కాని, ఇత్తడి కాని రెండు కుందులను తీసుకోవాలి. వాటిలో ఆవు నెయ్యి పోసి రెండు వత్తులు వేసి దీపారాధన చేయాలి. అనంతరం బ్రాహ్మణుల సమక్షంలో సమంత్రక పూర్వకంగా దీప దానం చేయాలి. ఈ దీప దానం చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం ఏంటంటే.. ‘సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ’.