తులసీదాస్ పట్ల ఇతర మతస్థులు సైతం ఆకర్షితులవుతుండటంతో ఆయా మత పెద్దలు అసూయ చెంది.. తులసీదాస్‌పై ఢిల్లీ పాదుషాకు కంప్లైంట్ చేశారు. ఇతర మతస్థులను మోసపూర్వకంగా తమ మతంలోకి మారుస్తున్నాడంటూ అభియోగం మోపారు. తులసీదాస్‌ను పాదుషా విచారణ నిమిత్తం ఢిల్లీకి పిలిపించారు. దర్బారుకు వెళ్లిన తులసీదాస్‌ను పాదుషా.. “మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట. నిజమేనా?’’ అని ప్రశ్నించారు. అప్పుడు తులసీదాస్.. “అవును ప్రభూ! రామనామం తారకమంత్రం. ఆ మహిమ వర్ణింపనలవి కానిది” అన్నాడు. అప్పుడు పాదుషా ఒక శవాన్ని తెప్పించి రామనామ మహిమతో ఈ శవాన్ని బ్రతికించండి! లేదా రామనామానికి ఎలాంటి మహిమ లేదని ఒప్పుకోండి” అని ఆజ్ఞాపిస్తాడు.

అప్పుడు తులసీదాసు జనన మరణాలనేవి జగత్ప్రభువు ఇష్టానుసారం జరుగుతాయి కానీ మానవుల కోరికలతో కాదని చెప్పి ఆ శవాన్ని తిరిగి బతికించడానికి నిరాకరిస్తాడు. తన ఆదేశాన్ని ధిక్కరించడంతో తులసీదాస్‌ను బంధించమని పాదుషా ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో తనను ఈ సంకట స్థితి నుంచి రక్షించమని కోరుతూ తులసీదాస్ రామ నామ జపం చేయసాగాడు. అంతే ఎక్కడి నుంచి వచ్చాయో కానీ వందలాది కోతులు సభలోకి ప్రవేశించాయి. తులసీదాస్‌ను బంధించేందుకు వచ్చిన సైనికులను చుట్టుముట్టాయి. వారి ఆయుధాలను లాక్కుని కదలకుండా చేశాయి. అంతా హడలిపోయారు. అప్పుడు తులసీదాస్‌కు సింహద్వారంపై ఆసీనులైన హనుమంతుడు దర్శనమిచ్చాడు. హనుమ దర్శనంతో పులకించిపోయిన తులసీదాస్.. అక్కడికక్కడే.. “జయ హనుమాన జ్ఞాన గుణసాగర’ అంటూ 40 దోహాలతో ఆశువుగా హనుమాన్ చాలీసాతో పవన సుతుని కీర్తించాడు. హనుమాన్ చాలీసా అలా పుట్టింది.
