అర్జనుడు తన అంతటి విలువిద్యకాడు లేడంటూ గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. ఒకరోజు ధర్మరాజు అర్జనుడితో దేవేంద్రుని పాశుపతాస్త్రాలు తీసుకురమ్మని పంపిస్తాడు. దీనికోసం ముందుగా పరమశివుని ప్రసన్నం చేసుకోమని అర్జనుడికి ఇంద్రుడు చెబుతాడు. సరేనని అర్జనుడు శివుని కోసం ధ్యానం మొదలు పెడతాడు. అర్జనుడిని పరీక్షించాలనుకున్న పరమేశ్వరుడు అతను ధ్యానం చేస్తున్న ప్రదేశానికి మూకాసురుడిని సూకర (పంది) రూపంలో పంపిస్తాడు. ఇక మహాశివుడు కిరాతకుడిగా అక్కడికి వెళతాడు. మూకాసురుడు అటు ఇటు తిరుగుతూ అర్జనుడికి తపోభంగం కలిగిస్తూ ఉంటాడు. ఆగ్రహించిన అర్జనుడు పందివైపు బాణాన్ని సంధిస్తాడు.
సరిగ్గా అదే సమయంలో కిరాతకుడి రూపంలో ఉన్న శివుడు కూడా బాణాన్ని సంధించాడు. అప్పుడు ఆ పందిని నేను చంపానంటే నేను చంపానంటూ వాగ్వాదం మొదలైంది. అది కాస్తా ఘర్ణణగా మారింది. కిరాతకునిపై కోపంతో అర్జనుడు పెద్ద ఎత్తున బాణాలను సంధించాడు. కానీ అవేమీ కిరాతకుడిని ఏమీ చేయలేకపోయాయి. కానీ కిరాతకుడు వదిలిన ఒక్క బాణంతో అర్జనుడు కిందపడిపోయాడు. దీంతో మరింత కోపంతో అర్జనుడు తన శక్తినంతటిని ఉపయోగించి ఒక బాణాన్ని సంధిస్తాడు. దీంతో ముల్లోకాలన్నీ స్తంభించాయి. భీకర గాలులు ఏదో ప్రపంచ వినాశనం జరుగుతున్నట్టుగా అనిపించడంతో అర్జనుడికి జ్ఞానోదయం కలుగుతుంది. తన ముందున్నది కిరాతకుడు కాదని గ్రహించి శివుని కాళ్లపై క్షమించమని పడతాడు. శివుడు చిరునవ్వుతో ఆశీర్వదించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు.