గేదె రూపంలో తప్పించుకోబోయిన శివుడు.. భీముడు ఎలా పట్టుకున్నాడంటే..

దేవతలకు సంబంధించి కొన్ని ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కేదార్‌నాథ్‌లో పరమేశ్వరుడు గేదె రూపంలో ఉండటం వెనుక కూడా ఒక కథ ఉంది. అదేంటంటే.. పాండవులు కురుక్షేత్రం యుద్ధానంతరం కౌరవ సోదరులను సహరించిన పాపం నుంచి విముక్తి కోసం శివుడిని వెదుక్కుంటూ హిమాలయాల వైపు వెళ్లారట. పాండవుల రాకను గుర్తించిన శివయ్య అక్కడి నుంచి మాయమై కేదార్‌లోకి వెళ్లాడట. విషయం తెలుసుకున్న పాండవులు సైతం శివుడిని వెంబడించి కేదార పర్వతానికి చేరుకున్నారు. అక్కడకు సైతం పాండవులు రావడంతో శివుడు గేదె రూపాన్ని ధరించి అక్కడున్న గేదెల మందలో కలిసిపోయాడు.

పాండవులకు శివుడు ఏమైపోయాడో అర్థం కాలేదు. కానీ ఆయనను ఎలాగైనా పట్టుకోవాలని ఓ ప్లాన్ చేశారు. దీనికోసం భీముడు భారీ కాయుడిగా మారిపోయాడు. వెంటనే తన రెండు కాళ్లను కేదార పర్వతానికి ఇరువైపులా పెట్టేశాడు. గేదలన్నీ భీముని పాదాల మధ్యకు వెళ్లిపోయాయి కానీ శివుడు మాత్రం వెళ్లలేకపోయాడు. అప్పుడు వెంటనే శివుడిని భీముడు గుర్తించాడు. గేదె రూపంలో ఉన్న శివయ్యను భీముడు పట్టుకోవడానికి యత్నించగా.. భూమిలోకి వెళ్లిపోబోయాడు. అప్పుడు గేదె వెనుక భాగాన్ని భీముడు గట్టిగా పట్టుకుని భూమిలోకి వెళ్లకుండా నిలిపివేశాడు. పాండవుల భక్తికి సంతోషించిన శివుడు వారి ఎదుట ప్రత్యక్షమై పాపాల నుంచి విముక్తులను చేశారు. అప్పటి నుంచి కేదార్‌నాథ్ శివుడు గేదె రూపంలో కొలువయ్యాడని.. గేదె తల నేపాల్‌లో ఉద్భవించిందని చెబుతారు.

Share this post with your friends