పెద్ద ఎత్తున కొండగట్టుకు తరలి వస్తున్న అంజన్న భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షాపరులు, భక్తుల రాకతో కొండంతా రామనామస్మరణతో మారు మోగుతోంది. అంజనీ పుత్రుడిని పెద్ద ఎత్తున దర్శించుకుని మాల విరమణ చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కొండగట్టులో రేపు సాయంత్రం వరకూ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు జరుగనున్నాయి.

కాగా.. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం కొండగట్టు దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చలవ పందిళ్లు, ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యంతో పాటు వైద్యులను సైతం అందుబాటులో ఉంచారు. 900 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల కోసం మూడు ఆర్టీసీ బస్సులను ఉచితంగా ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే భయాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. నిన్నటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కొండగట్టులో దీక్ష విరమణ చేస్తున్నారు. రేపు కూడా అంజన్న జయంతి వేడుకలు కొనసాగనున్నాయి.

Share this post with your friends