తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు సహస్రదీపాలంకారసేవ నిర్వహించారు. ఆ తరువాత శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
రాత్రి 8 నుండి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం సుగ్రీవుడు, అంగదుడు ఉత్సవమూర్తులను వేంచేపు చేసి వారితోపాటు ఆంజనేయస్వామివారికి పుష్పమాలలు సమర్పించారు.