శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు నేడు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ స్వామివారు రథంపై ఊరేగారు. ఉదయం 6.35 గంటల నుంచి రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. నిన్న ఉదయం 7 గంటలకు గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అటువంటి సూర్యప్రభను అధిష్టించి స్వామి ఊరేగడం ఆనందదాయకం.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం రాత్రి 7 గంటలకు గోవిందరాజస్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్భార్ కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తాడు.