తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చక్రస్నానం నిర్వహించారు. ఇవాళ రాత్రి ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఇక తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి 7 గంటలకు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇన్ని రోజుల పాటు వివిధ వాహనాలపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు అనుగ్రహించారు.