అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు శుభవార్త. ఈ యాత్రకు నేటి (ఏప్రిల్ 15) నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జూన్ 29 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. అంటే ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాత్రకు రావాలనుకుంటున్న భక్తుల కోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. దీనికోసం నేటి నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మంచు రూపంలో ఉండే శివుడిని దర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. నిజానికి ఈ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంటుంది. అయినా సరే లెక్క చేయకుండా భక్తులు లక్షలాదిగా స్వామివారి దర్శనానికి వస్తుంటారు.
www.jksasb.nic.in వెబ్‌సైట్ ద్వారా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లానుకునే భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. భక్తుల భద్రత విషయంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లను నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అమర్‌నాథ్ టైమ్ టేబుల్‌ను కూడా విడుదల చేసింది. అమర్‌నాథ్ ఆలయం వచ్చేసి దక్షిణ కశ్మీర్‌లో ఉంటుంది. హిమాలయ పర్వతాల్లో భూమికి 3880 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ యాత్రకు 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారే అర్హులు. గర్భిణులకు అవకాశం లేదు. ఇక ఈ యాత్ర అనంతనాగ్ జిల్లా పహల్గామ్, గండర్ బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు.