తిరుమల శ్రీవారి జూలై నెల దర్శన టికెట్లు, ఇతర సేవలు, వసతి గదుల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం నేడు విడుదల చేయనుంది. జులై నెలకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేశారు. ఈ టికెట్లు కేవలం నాలుగంటే నాలుగు నిమిషాల్లో అన్నీ బుక్ అయిపోయాయి. అలాగే ఇవాళ జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
శ్రీవారి సేవా కోటా టికెట్లను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు.. నవనీత కోటా టికెట్లను అదే రోజున ఉదయం 12 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. పరకామణి సేవా టికెట్లను 27న మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేస్తారు.
కాగా.. తిరుమలలో ఎన్నికల కారణంగా సిఫార్స్ లేఖలను అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ తగ్గింది. ఈ నేపథ్యంలోనే వీకెండ్ మినహా మిగిలిన రోజుల్లో ఎక్కడ ఆగకుండా.. నేరుగా వెళ్లి శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు కలుగుతోంది. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో కంపార్ట్‌మెంట్లలో భక్తులను ఉంచడం లేదు. కాగా.. నిన్నటితో తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. మంగళవారం బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకూ స్వామివారికి వివిధ రకాల సేవలను నిర్వహించారు.