కుమారస్వామికి చెందిన ఆరు క్షేత్రాల ప్రాముఖ్యం ఏంటంటే..

నెమలి వాహనుడైన కుమార స్వామి గురించి తెలియని వారెవరుంటారు? ఈ స్వామికి ఆరు ముఖాలు ఉంటాయని అంటారు. ఆరు అనే సంఖ్య ఈ స్వామికి ప్రతీక అని చెబుతారు. అసలెందుకు ఆరు అంటే కుమారస్వామికి అంత ఇష్టమంటే.. ఆయనను ఆరుగురు అక్కాచెల్లెళ్లు పెంచారట. అందుకే ఆరు అనేది ఆయనకు ప్రతీక అని అంటారు. కుమారస్వామికి క్షేత్రాలెన్ని ఉన్నా కూడా ముఖ్యంగా ఆరు క్షేత్రాలు అత్యంత మహిమాన్వితమైనవని అంటారు. వీటిని తమిళనాట ‘ఆరు పడై వీడు’ (ఆరు పుణ్యక్షేత్రాలు) అని పిలుస్తారు. అవేంటంటే.. తిరుపరన్కుండ్రం, తిరుచెందూరు, పళని, స్వామిమలై, తిరుత్తణి, పళమూడిర్చోళై.

తిరుత్తణి : రాక్షసులతో యుద్ధానంతరం కుమారస్వామి తమిళనాడులోని ఈ తిరుత్తని ప్రాంతంలోనే సేదతీరాడట. ఇక ఆయన వల్లీదేవిని వివాహం చేసుకుంది కూడా ఇక్కడేనంటారు. ఇక్కడే ఆయన వల్లీదేవిని వివాహం చేసుకున్నారు.

పళని : తమిళనాట దిండుగల్ జిల్లాలో ఉన్న పళని కొండ తెలుగువారికి సుపరిచితమే. ఇక్కడ చిన్న కొండపై దండాన్ని చేతబట్టుకుని ఉన్న కుమారస్వామిని ‘దండాయుధపాణి’ అని పిలుస్తారు. ఇక్కడి స్వామివారి విగ్రహాన్ని తొమ్మిది రకాల లోహాలతో రూపొందించడం మరో విశేషం.

తిరుపరన్కుండ్రం : ఆరు పైడైవీడులో ఇది తొలి క్షేత్రం. ఇది తమిళనాడులోని మధురైలో ఉంటుంది. మధుర మీనాక్షి ఆలయానికి కూతవేటు దూరంలో అంటే ఆ ఊరి పొలిమేరలో ఈ ఆలయం ఉంటుంది. ఇంద్రుని కుమార్తె దేవసేనని కుమారస్వామి ఇక్కడే వివాహం చేసుకున్నాడట.

తిరుచెందూరు : దీని ప్రత్యేకతేంటంటే.. కుమారస్వామి ఆరు ప్రముఖ ఆలయాలలో సముద్రతీరాన ఉన్న ఏకైక ఆలయం. ఇక్కడ కుమారస్వామి, శూరపాదం అనే రాక్షసునిపై విజయం సాధించాడట.

స్వామిమలై : తమిళనాడులోని కుంభకోణం అనే ఊరుకి అతిసమీపంలో ఉన్న ఈ ఆలయ ప్రాంతంలోనే కుమారస్వామి సాక్షాత్తు తన తండ్రి శివునికే ఓంకారం గురించి తెలియచేశాడట.

పళమూడిర్చోళై : మధురై నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల నడుము, ఓ చిన్న కొండపై ఈ క్షేత్రం ఉంటుంది. అందమైన ప్రకృతి నడుమ, వల్లీదేవసేన సమేత కుమారస్వామి ఇక్కడ అత్యంత అద్భుతంగా దర్శనమిస్తారు.

Share this post with your friends