వైభవంగా శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు..

వాసవీ కన్యకా పరమేశ్వరి.. వైశ్యుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతోంది. ఈ అమ్మవారి అసలు పేరు వాసవాంబ. ఈ అమ్మవారికి సంబంధించిన ఫేమస్ ఆలయం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉంది. ఇవాళ శ్రీ వాసవి మాత జయంతి కావడంతో పెనుగొండలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.వాసవీ మాతను దర్శించుకునేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్యవైశ్యులు భారీగా తరలివచ్చారు. 102 గోత్రీకులతో, 102 కన్యలు కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. వాసవీ మాత మాల ధారణ విరమణ సందర్భంగా హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసలు వాసవీ మాత జన్మ వృత్తాంతమేంటో తెలుసుకుందాం.

వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడి ఆధీనంలో ఉండేది. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. కుసుమ శ్రేష్టి భార్య కుసుమాంబ నిత్యం శివుని ఆరాధన చేస్తూ ఉండేది. అయితే వారికి వారసులేకపోవడంతో చింతించేవారు. తమ కుల గురువు సలహా మేరకు పుత్ర కామేష్టి యాగం చేశారు. దీంతో కుసుమ శ్రేష్టి, కుసుమాంబ దంపతులకు వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం ఉత్తర నక్షత్రం, కన్య రాశిలో కవల పిల్లలు జన్మించారు. వారిలో ఒకరు పాప, మరొకరు బాబు. అబ్బాయికి విరూపాక్ష అని.. అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు. ఈ వాసమాంబే తదుపరి రోజుల్లో వైశ్యుల ఆరాధ్య దైవంగా మారింది.

Share this post with your friends