సృష్టికి మాతృ స్వరూపమే లలితా దేవి.. ఆమే ఎందుకంటే..?

ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా. అందుకనే సృష్టికి మాతృ స్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు. ఆ అమ్మవారి మహత్తుని తలచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా చెబుతారు. అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా పేర్కొంటారు. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలో అందంగా ఉండేది అని అర్థం. కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొనవచ్చు. ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది.

అక్కడి ‘త్రిపుర’ రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టారు. లలితాసహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ’ అనే నామాలు పలకరిస్తాయి. ఈ మూడు నామాలూ కూడా సృష్టి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి. చాలా సహస్ర నామాలలో పునరుక్తి కనిపిస్తుంది. ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. ఊతపదాలు కూడా ఇందులో ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు.

Share this post with your friends