శివపార్వతుల ముద్దుల తనయుడు సుబ్రహ్మణ్యస్వామి. ఆయనకు వివాహం చెయ్యాలని పార్వతీదేవి భావించిందట. ఎవరైతే బాగుంటుందని వెదకగా.. లక్ష్మిదేవి కుమార్తె అయిన శ్రీవల్లీ దేవి కనిపించిందట. శ్రీవల్లీ దేవి మహా సౌందర్యవతి మాత్రమేకాకుండా బుద్ధిమంతురాలు, సంపదల తల్లి అయిన లక్ష్మీదేవి తనయురాలు కావడంతో తన కుమారుడికి శ్రీవల్లీదేవి సరైన అమ్మాయని పార్వతీదేవి భావించింది. వెంటనే విషయాన్ని భర్త శివుడికి చెప్పిందట. అయితే ఆయన చిరునవ్వులు చిదించి ధ్యానంలోకి వెళ్లిపోయారట. ఆ వెంటనే లక్ష్మీదేవి వద్దకు వెళ్లి మనసులోని మాటను పార్వతీ మాత తెలిపిందట.
లక్ష్మీదేవి చూస్తేనే సంపన్నురాలు.. పార్వతీమాత మద్ద రుద్రాక్షమాలలు, విభూది తప్ప ఏమీ లేవు. మరి లక్ష్మీదేవి ఈ పెళ్లికి ఎలా అంగీకరిస్తుంది. అదే మాటను పార్వతీదేవి ముఖంపైనే చెప్పేసిందట. లక్ష్మీదేవి మాటలకు కలత చెందిన పార్వతీదేవి.. శివుని వద్ద తన బాధను వెళ్లగక్కింది. అప్పుడు శివుడు తన ఒంటి మీదున్న రుద్రాక్షను ఇచ్చి ఈ ఎత్తునకు సరిపడే బంగారం ఇవ్వమని అడగమని చెబుతాడు. వెంటనే లక్ష్మీదేవిని కలిసిన పార్వతీదేవి శివుడిచ్చిన రుద్రాక్షను ఇచ్చి దానికి సరిపడ బంగారం ఇవ్వమని కోరుతుంది. వెంటనే ఒక త్రాసు తెప్పించి లక్ష్మీదేవి రుద్రాక్షను ఒక వైపున ఉంచి దానికి సరిపడా బంగారం ఇవ్వాలని చూస్తుంది. తన ఒంటిపైనున్న బంగారమే కాకుండా సంపదనంతా పోగేసి తూచినా రుద్రాక్షకు సరిపోదు. దీంతో లక్ష్మీదేవి షాక్ అవుతుంది. ఇలాంటి రుద్రాక్షలు ఎన్నో తన భర్త వద్ద ఉన్నాయని పార్వతీదేవి చెప్పడంతో తన తప్పిదానికి బాధపడిన లక్ష్మీదేవి తన కుమార్తెను సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇచ్చి వివాహం చేస్తుంది.