తిరుపతిలోని కార్వేటినగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక వసంతోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముహూర్తం పెట్టేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న పలు కార్యక్రమాలను సైతం తెలిపింది. ప్రతి రోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకూ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు.ఈ సందర్భంగా మూడు రోజులపాటు సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లను ఘనంగా ఊరేగించనున్నారు. అనంతరం టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ధార్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.