సునామీ సైతం ఆ అమ్మవారిని టచ్ చేయలేకపోయింది.. ఆ అమ్మవారి కథేంటో తెలిస్తే..

2004లో సునామీ సృష్టించిన కల్లోలాన్ని నేటికీ మనం మరచిపోలేం. భారత తూర్పు, పశ్చిమ తీరప్రాంతాల్లోని పలు ప్రదేశాల్లో విలయం సృష్టించింది. సముద్ర తీర ప్రాంతాలైతే సునామీ ధాటికి అల్లాడిపోయాయి. వీటిలో కేరళ ఒకటి. సునామీ ధాటికి కేరళ దక్షిణ తీరం తీవ్ర నష్టపోయింది. ఇంతటి సునామీ సైతం ఓ అమ్మవారి ఆలయాన్ని ఏమీ చేయలేకపోయింది. ఆ ఆలయం ఎక్కడుందంటారా? కేరళలోని కొల్లాం జిల్లా శంకర మంగళం సమీపంలో ఉంది కట్టిల్‌ మెక్కతిల్‌ భాగవతి అమ్మవారి ఆలయం. కొల్లాం జిల్లాలో అరేబియా సముద్రానికి, జలమార్గానికి మధ్య ఉన్న చిన్న దీవిలోని ఈ అమ్మవారి ఆలయాన్ని సునామీ టచ్ కూడా చేయలేకపోయింది. అదంతా అమ్మవారి మహిమేనని అక్కడి వారు చెబుతుంటారు. దీనికి అనేక శతబ్దాల చరిత్ర ఉంది.

స్థలపురాణం ప్రకారం.. భాగవతి అమ్మవారు మొసలిపై చంపక్కులం నుంచి ఈ చిన్న దీవిలో స్వయంభువుగా వెలిశారు. ఈ అమ్మవారి వద్ద వెలిగించిన దీపం ఎప్పటికీ కొండెక్కదట. అమ్మవారే ఈ దీపాన్ని స్వయంగా వెలిగించారని చెబుతూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలకు చంపక్కులం నుంచి ధ్వజం రావడం సంప్రదాయంగా మారింది. ఇక్కడ అమ్మవారిని మొక్కుకున్న భక్తులు తమ కోరిక తీరిన వెంటనే ఇత్తడి గంటలను ఇస్తూ ఉంటారు. మరి ఆ గంటలన్నీ ఏం చేస్తారని అడుగుతారా? వాటన్నింటినీ ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కొమ్మలకు కడతారు. ఇలా మొక్కులు తీరిన వారి నుంచి నెలకు దాదాపు 4 లక్షల వరకూ గంటలు వస్తాయట. వాటన్నింటితో మర్రిచెట్టు సగం నిండిపోయింది. ఓ సారి ఆలయ ధ్వజస్తంభం నుంచి ఓ గంట కిందకు పడిపోవడంతో అర్చకుల్లో ఒకరు దాన్ని తీసుకొని మర్రిచెట్టు కొమ్మకు కట్టారట. ఇక అంతే ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయట. అప్పటి నుంచి మర్రి చెట్టుకు గంటలు కట్టే సంప్రదాయం ప్రారంభమైంది.

Share this post with your friends