మాతా జగజ్జనని ఆది పరాశక్తి.. అమ్మవారు అనేక రూపాల్లో భక్తులకు అభయం ఇస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారి ఆలయాలు దేశంలో కోకొల్లలు. వాటిలో ముఖ్యమైనది రాజస్థాన్‌లోని జై సల్మేర్. ఈ ఆలయాన్ని తనోట్ మాతా ఆలయమని పిలుస్తారు. పాక్ సరిహద్దును ఆనుకుని ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో పాక్‌లోని బలూచిస్థాన్‌లో వెలిసిన హింగ్లాజ్ మాత అవతారమే తనోట్ మాత అని చెబుతారు. ఈ ఆలయానికి అద్భుతమైన చరిత్ర ఉంది. 1965, 1971లలో జరిగిన భారత్ – పాక్ యుద్ధాల్లో అమ్మవారి ప్రభావంతోనే భారత్ విజయం సాధించిందట. నిజానికి 1965లో జరిగిన యుద్ధంలో పాక్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు స్కెచ్ గీసిందట.
పాక్ దాడికి పాల్పడిన సమయంలో ఆలయ సమీపంలో భారత్‌కు చెందిన కొద్దిమంది సైనికులు మాత్రమే విధుల్లో ఉన్నారు. పాక్ ఏకంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న భారత సైనికులపై 3 వేల బాంబులను ప్రయోగించిందట. ఒక్క బాంబు కూడా పేలలేదట. ఇదంతా అమ్మవారి అద్భుతశక్తికి నిదర్శనమని చెబుతారు. దీంతో పాక్ బలగాలు దెబ్బకు వెనుదిరిగాయట. ఈ ఆలయాన్ని 13 శతాబ్ధాల క్రితం రాజపుత్ర వంశానికి చెందిన తానురావు నిర్మించారు. ఇప్పటికీ ఆలయంలో ఆ వంశస్థులు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయం 1971 భారత్ – పాక్ యుద్ధానంతరం సరిహద్దు భద్రతాదళం నిర్వహణలోకి వెళ్లింది. భారత విజయాలకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో ఒక విజయ స్తంభం.. ఆపై పాక్‌పై విజయానికి గుర్తుగా ఏటా వేడుకలు నిర్వహిస్తారు.