భారత దేశంలో వింతలూ విశేషాలకు కొదువేమీ లేదు. ముఖ్యంగా ఆలయాల్లో జరిగే వింతలకు అంతంటూ ఉండదు. ఇలాంటి వింతే మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని మాతంగేశ్వర ఆలయం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురికాక మానరు. ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి జీవం ఉందని అందరూ భావిస్తుంటారు. ఎందుకంటే ఈ శివలింగం ఎత్తు ప్రతి ఏడాది పెరుగుతూ ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం
ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోని శరత్ పూర్ణిమ రోజున శివలింగం ఎత్తు పెరుగుతూ ఉంటుందట. ప్రస్తుతం ఈ శివలింగం పొడవు దాదాపు 9 అడుగులకు చేరుకుంది. ఈశ్వరుడు పచ్చల రత్నాన్ని దర్మరాజుకు ఇచ్చాడు. అనంతరం ధర్మరాజు ఆ రత్నాన్ని మాతంగ మహర్షికి ఇచ్చాడట. మాతంగ మహర్షి ఆ పచ్చల రత్నాన్ని 18 అడుగుల శివలింగం మధ్యలో పెట్టి దానిని భూమిలో పాతి పెట్టాడట. అప్పటి నుంచి ఆ రత్నం శక్తి కారణంగా శివలింగం ప్రతి ఏడు మానవుడి వలే పెరుగుతూ ఉందట. అందుకే అక్కడి వారంతా దీనిని జీవమున్న శివలింగమని చెబుతుంటారు.