ఈ స్వామివారి రాజసమే రాజసం.. బంగారు విగ్రహం.. ఇంకెన్ని విశేషాలో..

కొందరు దేవుళ్ల రాజసం చూసి తరించాల్సిందే. మాటల్లో చెప్పలేనిది. అలాంటి దేవుడే అనంత పద్మనాభస్వామి. ఈ ఆలయం గురించి తెలియని వారుంటారా? 2011లో ఆయన నేలమాళిగలను తెరిచి పెద్ద ఎత్తున బంగారం, వజ్ర వైఢూర్యాలను లెక్కించారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్. ఏ నోట విన్నా ఈ ఆలయం పేరే. కేరళలోని త్రివేండ్రంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా కూడా దీనిని చెబుతారు. ఇక ఈ ఆలయంలో మహావిష్ణువు కొలువై ఉన్నాడు. ఆయన విగ్రహం బంగారంతో చేశారు. ఈ విగ్రహం ఖరీదు దాదాపు రూ.500 కోట్లు అని అంచనా. ఇక ఈ స్వామివారి రాజసం అంతా ఇంతా కాదు. వేలల్లో బంగారు గొలుసులు.. వాటిలో ఒకటి 18 అడుగుల పొడవుంటుంది.

ఇక స్వామివారి తెర కూడా బంగారంతో చేయబడిందే కావడం విశేషం. దేవుని తెర కోసం 36 కిలోల బంగారాన్ని ఉపయోగించారట. అనంతపద్మనాభుడు అంటే నాభి యందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్ధం. మరి తిరువనంద పురం అంటే తమిళంలో ఏంటో తెలుసా? ‘ది సిటీ ఆఫ్ లార్డ్ అనంత’. ఈ ఆలయం చేరా, ద్రావిడ రెండింటి నిర్మాణ శైలితో చాలా క్లిష్టమైన కలయికలో ఉంటుంది. ప్రస్తుతం ట్రావెన్ కోర్ సంస్థానం ఆధీనంలో ఈ ఆలయం ఉంది. ఇక ఆలయంలోని మూల విరాట్‌ను 1208 సాలగ్రామాలతో తయారు చేశారు. స్వామివారి భారీ విగ్రహాన్ని మూడు ద్వారాల గుండా చూడాలి. విగ్రహం ఆదిశేషునిపై పవళించినట్టుగా ఉంటుంది. మొదటి ద్వారం గుండా చూస్తే స్వామివారి తల భాగం.. మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు.. అందులో పుట్టిన తామరపువ్వు, మూడో ద్వారం గుండా చూస్తే స్వామివారి పాద భాగం కనిపిస్తుంది.

Share this post with your friends