సృష్టిని క్రియేట్ చేసిన బ్రహ్మ.. జీవులతో పాటు మానవ గర్భాన్ని సైతం సృష్టించాడు. ఇది ఎందుకో గానీ బ్రహ్మకు సంతృప్తినివ్వలేదట. చుట్టూ ఉన్న నిశ్శబ్దం ఆయనకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందట. దీంతో విష్ణు మూర్తి అనుమతి తీసుకున్నబ్రహ్మ తన కమండలం నుంచి నీటిని చిలకరించడంతో అవన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయట. ఆ వెంటనే కింద పడిన నీటి బిందువుల నుంచి స్త్రీ రూపంలో ఓ అద్భుతమైన సృష్టి ఆవిర్భవించిందట. ఒక చేతిలో వీణతో.. మరో చేతిలో వరదాభయ భంగిమలో.. మరో రెండు చేస్తుల్లో పూస్తకాలతో ఆ దేవత చూడముచ్చటగా ఉందట.
ఆ దేవతను బ్రహ్మ వీణ వాయించమని కోరగా.. ఆమె వాయించడంతో అద్భుతమైన ధ్వని వెలువడిందట. ఆ ప్రవాహం శబ్దంగా మారి.. గాలి సైతం కంపించిందట. దీంతో ప్రపంచంలోని మానవులకు వాక్కు లభించిందట. అప్పుడు బ్రహ్మ ఆమెకు వాక్కును ప్రసాదించడంతో ఆమె వాగ్దేవి.. అలాగే సరస్వతి అని కూడా పిలవబడింది. ఇక ఆ సరస్వతి మాతే కాలక్రమంలో బాగీశ్వరి, భగవతి, శారదా, వీణా పాణి, వాగ్దేవి వంటి అనేక పేర్లతో పూజించబడుతూ వస్తోంది. అప్పటి నుంచి అమ్మవారు కళాకారులందరికీ అధి దేవతగానూ.. చదువుల తల్లిగానూ మారిపోయింది.