సిరి సంపదల కోసం తప్పక లక్ష్మీదేవిని పూజించాలని చెబుతుంటారు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని అంటారు. అలాగే లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం కూడా ఒకటుంది. ఆ వ్రతాన్ని కోజాగిరి వ్రతం అని పిలుస్తారు. దీనిని ఆచరించడం వలన సర్వ దరిద్రాలు తొలిగి అమ్మవారి కటాక్షం లభిస్తుంది. ఈ వ్రతం గురించి వాలిఖిల్య మహర్షి వివరించినట్టుగా పురాణాలలో ఆధారాలు కూడా ఉన్నాయి. లక్ష్మీదేవిని పూజించడం వలన కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఓ కథ కూడా ఉంది. మగధ దేశంలో వలితుడనే నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు. ఆయన భార్య చండి పరమ గయ్యాళి. ప్రతి దానికీ సాధించుకుతినేది.
వలితుడికి గణేష్ వర్మ అనే స్నేహితుడు నువ్వు నీ భార్యకు ఏం చెప్పాలన్నా వ్యతిరేకంగా చెప్పమని సలహా ఇచ్చాడు. ఒకరోజు వలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది. స్నేహితుడి సలహాను దృష్టిలో పెట్టుకుని తన తండ్రి ఆబ్దికాన్ని చేయించదలుచుకోలేదని భార్యకు చెబుతాడు. చండి దగ్గరుండి మరీ ఆబ్దికం చేయిస్తుంది. అనంతరం పిండాలను నదిలో వదిలి రమ్మంటే చండీ వెళ్లి ఊరిలోని కాలువలో పడేస్తుంది. దీంతో బాధపడిన వలితుడు ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్లి దీక్షలో కూర్చొంటాడు. ఆశ్వయుజ పౌర్ణమి నాడు ముగ్గురు నాగకన్యలు వలితుడు దీక్ష చేస్తున్న ప్రాంతానికి దగ్గరలోని నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గరూ పాచికలాడేందుకు వలితుడిని పిలుస్తారు. కానీ వలితుడు రాలేనని చెబుతాడు. ఈ పుణ్యదినాన పాచికలాడాలని వలితుడిని ఒప్పించి తమతో తీసుకెళతారు. ఇక లక్ష్మీ సమేతుడై ఉన్న విష్ణు మూర్తి ఆ సమయంలో ఎవరు మేలుకుని ఉన్నారని చూడగా.. నాగకన్యలతో పాటు వలితుడు పాచికలు ఆడుతూ కనిపించడంతో సంతోషించి వారికి లక్ష్మీదేవి సకల సంపదలు ప్రసాదించిందట. కాబట్టి ఆశ్వీయుజ పౌర్ణమినాడు లక్ష్మీదేవిని పూజించినవారికి సర్వసంపదలు కలుగుతాయట.