శివుడు త్రిపురారిగా ఎలా మారాడో తెలుసా?

సృష్టి లయకారుడు, భోలాశంకరుడు శివునికి.. 3 సంఖ్యకు సంబంధమేంటి? ఎందుకు ఆయనకు సంబంధించిన ప్రతిదీ 3 సంఖ్యతో ముడిపడి ఉంటుంది? అంటే.. 3 అనే సంఖ్యను బృహస్పతి పాలించే గ్రహమట. శివ పూజలో 3 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. శివపురాణం ప్రకారం.. ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలను సృష్టించి అజేయులుగా మారారట. ఆ నగరాలకు త్రిపుర అని పేరు పెట్టారట. వీరు చేసే విధ్వంసం నుంచి ప్రజలను రక్షించమని కోరుతూ దేవతలంతా శివుడిని ఆశ్రయించారట. అప్పుడు భూమిని రథంగా చేసుకున్న శివుడు.. సూర్య, చంద్రులను రథానికి చక్రాలుగా చేసుకుని ఆది శేషుడిని విల్లుగా మార్చి.. మహా విష్ణువును బాణంగా మార్చి బాణాన్ని సంధించగా.. మూడు నగరాలు కాలి బూడిదయ్యాయి. ఆ బూడిదను శివుడు శరీరంపై పూసుకుని త్రిపురారిగా మారాడు.

శివుని ఆయుధం త్రిశూలం. మూడు అంచులున్న ఏకైక ఆయుధం త్రిశూలం. ఇందులో ఆకాశం, భూమి, పాతాళం ఉన్నాయి. శివుడిని త్రినేత్రుడని అంటారు. అంటే మూడు కళ్లు కలవాడని. ఆయనకు కోపం వస్తే మూడో కన్ను తెరుస్తాడట. అప్పుడిక అంతా భస్మమేనని అంటారు. శివుని నుదిటిపై విభూదితో మూడు రేఖలను అలంకరిస్తారు. వీటిని త్రిపుండ్రాలు అని కూడా అంటారు. శివుడికి బిల్వ పత్రాలంటే చాలా ఇష్టమని చెబుతారు. భోళా శంకరుడిని వీటితో పూజిస్తే చాలా సంతోషిస్తాడట. మరి ఈ బిల్వపత్రాలు ఎలా ఉంటాయో తెలుసు కదా.. బిల్వపత్రంలో మూడు ఆకులు కలిసి ఉంటాయి. ఈ మూడు ఆకులు త్రిమూర్తుల స్వరూపమని చెబుతారు. వీటితో శివయ్యను పూజిస్తూ పూజ సంపూర్ణమవుతుందట.

Share this post with your friends