ఇంద్రునికి తాను స్వర్గ లోకాధిపతిననే అహంకారం చాలా ఎక్కువ. అయితే ఆయన అహంకారాన్ని కృష్ణార్జునులు అణచివేశారు. అదెలాగంటే.. వేసవి తాపాన్ని తాళలేక కృష్ణార్జనులు ఓ సందర్భంగా దట్టమైన అటవీ ప్రాంతమైన ‘ఖాండవవనం’లో సేద దీరుతారు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చి తాను తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నానని.. తన ఆకలిని మీరు మాత్రమే తీర్చగలరని కాట్టి సాయం చేయమని కోరాడు. కృష్ణార్జనులు సరేనని అభయమిచ్చారు. అప్పుడు ఆ బ్రహ్మణుడు అగ్ని దేవుడిగా మారిపోతాడు. ఖాండవవనాన్ని దహిస్తే తన ఆకలి తీరుతుందని.. అలాగే అక్కడి భూమి సారవంతంగా మారి జీవరాశులన్నీ కొత్త ఊపిరిని పోసుకుంటాయని తెలిపాడు.
అయితే ఆ అడవిలో తన స్నేహితుడైన తక్షుడు అనే సర్పరాజు ఉండటంతో ఇంద్రుడు దీనికి అడ్డుపడుతున్నాడని.. తాను ఖాండవవనాన్ని ఆక్రమించిన ప్రతిసారీ ఇంద్రుడు వర్షాన్ని కురిపించి అడ్డుపడుతున్నాడని అగ్నిదేవుడు తెలిపాడు. దీనికి తాము సాయం చేస్తామని అగ్నిదేవుడికి కృష్ణార్జనులు అభయమిచ్చారు. ఖాండవవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే ఇంద్రుడు వర్షాన్ని కురిపించడం ప్రారంభించాడు. దానిని చూసిన అర్జనుడు తన విల్లుతో వర్షపు చుక్క నేల మీద పడకుండా బాణాలను అడ్డు పెట్టాడు. ఆగ్రహించిన ఇంద్రుడు భూమి మీదకు వచ్చి కృష్ణార్జునలతో యుద్ధం చేసి ఓటమి పాలయ్యాడు. మొత్తానికి అగ్నిదేవుడు ఖాండవవనాన్ని పూర్తిగా దహించివేశాడు. అలా ఇంద్రుడి గర్వాన్ని కృష్ణార్జునులు అణచి వేశారు.