తిరుమల శ్రీవారికి జరిగే కొన్ని ముఖ్య కార్యక్రమాల్లో ఒకటి ఆర్జిత సేవ. ఈ ఆర్జిత సేవకు రోజుకు కొందరిని మాత్రమే ఆహ్వానిస్తారు. వీరిని కూడా లక్కీడిప్ ద్వారా ఎంపిక చేస్తారు. నిర్ణీత రుసుమును చెల్లించిన భక్తులకు మాత్రమే అనుమతి. అది కూడా టికెట్లు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. అందరికీ లభించవు. అసలు ఆర్జిత వసంతోత్సవంలో భాగంగా శ్రీవారికి ఎలాంటి సేవ నిర్వహిస్తారు అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఈ ఆర్జిత సేవను వైభవోత్సవ మండపంలో సాయంకాలం 3 – 4 గంటల మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు.
ఈ ఆర్జిత సేవలో భాగంగా భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, చందనం, పసుపు మున్నగు అభిషేక ద్రవ్యాలతో కన్నుల పండువగా జరగనుంది. స్వామి అమ్మవార్ల విగ్రహాలకు సుగంధ ద్రవ్య లేపనాలను పూస్తారు. దీనిలో భాగంగా వేద పండితులు పురుష సూక్తం, నారాయణ సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం లను పఠిస్తారు. అనంతరం పంచామృతాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం నిర్వహిస్తారు. చివరకు గంధంతో లేపనం చేసి నీటితో అభిషేకం చేస్తారు. ఇక ఈ కార్యక్రమానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం టీటీడీ ప్రతి నెలా మొదట శుక్రవారం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ టికెట్లను భక్తులు బుక్ చేసుకున్న భక్తులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేస్తారు.