రామాయణం ప్రస్తావన రాగానే మనకు గుర్తొచ్చేది రామ రావణాసుర యుద్ధం. అయితే రావణుడు అంతకు ముందు ఎవరితోనూ యుద్ధం చేయలేదా? అంటే చేయడమూ అయ్యింది.. ఆ యుద్ధంలోనూ ఓడిపోవడమూ జరిగింది. ఇక ఎవరితో యుద్ధం చేశాడంటారా? ఆయన పేరు మాంధాత. భృగు మహర్షి దాచి ఉంచిన మంత్ర జలం సేవించడంతో యవనాశ్వునికి పుట్టిన కుమారుడే మాంధాత. చిన్నతనం నుంచే యుద్ధ విన్యాసాలలో నేర్పరి. 12వ ఏటనే రాజ్యాభిషక్తుడైన మాంధాతను ఎలాగైనా ఓడించాలనుకుంటాడు రావణుడు.
కేవలం తనను మించిన బలవంతుడు లేడని నిరూపించుకోవడం కోసమే రావణుడు యుద్ధానికి దిగుతాడు. మాంధాతకు రావణుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. మాంధాత ముందు రావనుడి పన్నాగాలేమీ ఫలించవు. నానా తంటాలు పడినా కూడా మాంధాతపై రావణుడు పై చేయి సాధించలేకపోతాడు. చివరకు మాంధాతను ఓడించడం కష్టమనే సత్యాన్ని గ్రహిస్తాడు. అప్పడు సృష్టి కర్త బ్రహ్మ, స్వర్గలోకాధిపతి ఇంద్రుడు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సంధి కుదుర్చుతారు. చివరకు రావణుడు ఓటమి భారంతోనే లంకకు చేరుకుంటాడు.