వరుథిని ఏకాదశి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీని వరుథిని ఏకాదశి లేదా బరుతని ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు గురించి అవగాహన ఉన్న హిందువులు దీనిని అత్యంత పర్వదినంగా భావిస్తారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువు అవతారమైన వామన అవతారాన్ని పూజిస్తారు. ఈ నెల 4వ తేదీనే వరుథిని ఏకాదశి కావడంతో దీని గురించి కొన్ని విషయాలు మీకోసం. ఈ రోజున శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుని పూజించిన వారికి అంతా మంచి జరుగుతుంది. ఏ విషయంలోనైనా భయాందోళనలుంటే వాటి నుంచి విముక్తి లభిస్తుందట. అంతేకాకుండా ఈ రోజున దానాలు చేస్తే విశిష్ట ఫలితాలు లభిస్తాయి.
మరి ఏ ఏ వస్తువులు ఈ రోజున దానం చేయాలనే కదా మీ సందేహం? నిజానికి ఈ రోజున అన్ని దానాల్లో కెల్లా ఉత్తమమైన దానం అన్నదానం. కాబట్టి వరుథిని ఏకాదశి నాడు అన్నదానం చేస్తే దేవతలతో పాటు మన పూర్వీకులు సైతం సంతృప్తి చెందుతారట. ముఖ్యంగా ఈ రోజున అన్నదానం చేయడం వలన అన్నపూర్ణాదేవి కటాక్షం లభిస్తుందట. సిరి సంపదలు, శుఖశాంతులకు కొదవ ఉండదట. అలాగే మట్టి కుండలో నీటిని నింపి దానం చేసినా కూడా ఉత్తమమైన ఫలితం లభిస్తుందట. నీటి దానం చేసినా కూడా వారి పిల్లలు ఎలాంటి సమస్యలు లేకుండా దీర్ఘాయుష్షుతో జీవిస్తారట.