కలియుగ దైవం వేంకటేశ్వర స్వామితోనే ఓ భక్తుడు పాచికలు ఆడాడు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఆ భక్తుడు మరెవరో కాదు.. బావాజీ. తిరుమలలోని మాఢవీధుల్లో ప్రధాన గోపురానికి కుడివైపున ఉన్న మఠం ఆయనదే. ఆ మఠాన్ని హాథీరాం మఠం అని కూడా అంటారు. ఈ మఠంపై వేంకటేశ్వరస్వామితో బావాజీ పాచికలాడుతున్న దృశ్యం కనిపిస్తుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ తిరుమలకు చేరుకున్న బావాజీ మలయప్ప స్వామిని చూడగానే మనసు లగ్నమై అలానే ఉండిపోయాడు. ఆలయంలో మైమరిచిపోయి గంటల తరబడి ఉండటంతో విసిగిపోయిన అర్చకులు ఆయనను ఆలయంనుంచి బయటకు గెంటేశారు.
పైగా ఇకపై ఆలయంలోకి రాకూడదంటూ ఆంక్షలు విధించారు. దీంతో కన్నీరుమున్నరవుతున్న బావాజీ ఓదార్చేందుకు స్వయంగా ఆ బాలాజీయే కిందకు దిగి వచ్చారు. నిన్ను గుడిలోకి రానివ్వకుంటే నేనే రోజు నీ దగ్గరకు వస్తానని మాటిచ్చారు. అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగియగానే బావాజీ ఉండే మఠానికి స్వామివారు వచ్చేవారు. అలా బావాజీతో పాచికలు కూడా ఆడేవారు. అలా ఒకసారి పాచికలు ఆడుతూ స్వామివారు సమయం చూసుకోలేదు. సుప్రభాతవేళలో అర్చకులు వస్తున్న విషయాన్ని గమనించి అప్పుడు గుడిలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన తన కంఠాభరణాన్ని బావాజీ మఠంలోనే మరచిపయారు. దానిని తిరిగిచ్చేందుకు వెళ్లిన బావాజీని అర్చకులు దొంగిలించాడనుకుని స్థానిక నవాబు వద్దకు తీసుకెళ్లారు. బావాజీ చెప్పేది వినకుండా అతడికి కారాగారంలో బంధించారు. అప్పుడు శ్రీనివాసుడే నీకోసం వస్తున్న మాట నిజమైతే కారాగారం నిండా చెరకు గడలు వేసి ఇవన్నీ పొడిగా తెల్లారిపాటికి అయిపోవాలని చెప్పి వెళ్లిపోయారు. అప్పుడొక ఏనుగు వచ్చి వాటన్నింటిని పిప్పి చేసేసింది. అలా బావాజీకి హథీరాం బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది. అసలు విషయం తెలుసుకున్న నవాబు బావాజీని ఆలయ అధికారిగా నియమించారు.