ఏవైనా భయాలుంటే వెంటనే ఆంజనేయస్వామిని మొక్కుతాం. కానీ హనుమంతుడని అనారోగ్యాల బారి నుంచి రక్షించమని కూడా మొక్కుతాం. ప్రత్యేకంగా అక్కడి హనుమంతుడైతే అనారోగ్యాలను నయం చేస్తాడట. ఆ క్షేత్రం ఎక్కడుందో తెలుసా? చిత్తూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్ధగిరిలో అరగొండ వీరాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇది సంజీవరాయ క్షేత్రంగా పిలవబడుతోంది. ఇక ఇక్కడి హనుమంతుడు ధన్వంతరిగా పూజలు అందుకుంటున్నాడు.
ఈ ఆలయం పచ్చని కొండల మధ్యలో ఉంటుంది. ఇక్కడి హనుమంతుడిని మొక్కి ఇక్కడున్న తీర్థంలోని ఔషధ గుణాలున్న నీటిని తాగితే అనారోగ్యాలన్నీ ఇట్టే మాయమవుతాయట. అందుకే ఈ ఆలయానికి సంజీవరాయ క్షేత్రమని పేరు వచ్చింది. ఇక స్వామివారిని మొక్కి ఏ పని మొదలు పెట్టినా కూడా విజయం తప్పక లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక ఈ స్థలపురాణమేంటంటే.. సీతమ్మను లంక నుంచి విడిపించేందుకు రామలక్ష్మణులు వానర సమేతంతో వెళ్లి రావణుడిపై యుద్దం చేస్తారు. అయితే రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు కారణంగా లక్ష్మణుడు మూర్చబోవడంతో ఆయన లేవాలంటే సంజీవని మూలిక అవసరమవుతుంది. అలా రామాజ్ఞతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని మూలిక ఏదో తెలియక సంజీవ పర్వతాన్ని పెకిలించి లంకకు తీసుకొస్తాడు. ఇలా తీసుకొస్తున్న క్రమంలో అర్ధ భాగం విరిగి కింద పడిపోయిందట. ఆ ప్రాంతమే అరగొండ లేదంటే అర్ధగిరి.