జ్వాలా ముఖి అమ్మవారి గురించి తెలుసా?

అమ్మవారిని మనం ఏదో ఒక రూపంలో కొలుచుకుంటూ ఉంటాం. ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపమంటూ ఏమీ ఉండదు. అమ్మవారు.. భావాతీతంగా ఉంటారు. అలాంటి అమ్మవారిని అగ్ని రూపంలో ఓ ప్రదేశంలో కొలుస్తారు. అక్కడి ఆలయాన్ని జ్వాలాముఖి ఆలయం అంటారు. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉంది. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి యాగ గుండంలో దూకి తనను తాను దహించుకున్న విషయం తెలిసిందే. అలా దహించుకుపోయిన అమ్మవారి శరీర భాగాలు 18 చోట్ల పడ్డాయని చెబుతారు. వాటినే మనం అష్టాదశ శక్తి పీఠాలని పిలుస్తూ ఉంటాం. వాటిలో ఒకటే జ్వాలాముఖి క్షేత్రం.

జ్వాలాముఖిలో అమ్మవారి నాలుక పడిందని చెబుతుంటారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ అమ్మవారు నాలుక నుంచి నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. ఈ మంట ఎంతో కాలంగా వస్తోంది కానీ దీని వెనుక కారణం మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. కొందరు మాత్రం దీని వెనుక ఏదో కుట్ర దాగుందని భావించారు. వారంతా భంగపడక తప్పలేదు. స్థలపురాణం ప్రకారం ఓ రాజుకి అమ్మవారు కలలో కనిపించి తాను ఫలానా చోట ఉన్నానని చెప్పడంతో అక్కడంతా రాజుగారు వెదికించారట. కానీ అమ్మవారి విగ్రహమేదీ కనిపించలేదట. అయితే ఓ మంట మాత్రం కనిపించిందట. ఇక అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారట. ఇప్పటికీ ఆ ఆలయంలో జ్వాల మాత్రమే కనిపిస్తుంది.

Share this post with your friends