హిందు పురాణాల ప్రకారం.. మనం చాలా మంది దేవతలను పూజిస్తూ ఉంటాం. మనం సూర్య చంద్రులను సైతం ఆరాధిస్తూ ఉంటాం. ద్వాదశ జ్యోతిర్లింగాలు.. అష్టాదశ శక్తి పీఠాల మాదిరిగా సూర్యుడిని సైతం ద్వాదశ ఆదిత్యులుగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ ద్వాదశ ఆదిత్యులు ఎవరో కారు.. అదితి, కశ్యపుల 12 మంది సంతానాన్నే ద్వాదశ ఆదిత్యులని చెబుతారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితి గతులను బట్టి ద్వాదశాదిత్యులను వివిధ పేర్లతో అభివర్ణిస్తారు. భాగవతంలో ద్వాదశ ఆదిత్యుల ప్రస్తావన ఉంది.
తెలుగు పంచాంగం ప్రకారం మనకున్న 12 నెలల్లో ఒక్కో నెలలో సూర్య భగవానుని ఆయా ఆదిత్యుని నామంతో పూజిస్తూ ఉంటారు. అందుకే సూర్య నమస్కారాలు సైతం 12 ఉంటాయి. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో శుచిగా స్నానమాచరించి సూర్యుడి ఒక్కో పేరు చెబుతూ 12 సూర్య నమస్కారాలు ప్రతిరోజూ చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవట. సూర్య నమస్కారాలతో పాటు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ నిరాటంకంగా చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతామట.
ద్వాదశాదిత్యుల పేర్లు.. సంచరించే మాసాలు
ధాత – చైత్ర మాసం
అర్యముడు – వైశాఖ మాసం
మిత్రుడు – జ్యేష్ఠ మాసం
వరుణుడు – ఆషాఢ మాసం
ఇంద్రుడు – శ్రావణ మాసం
వివస్వంతుడు – భాద్రపద మాసం
త్వష్టా – ఆశ్వయుజ మాసం
విష్ణువు – కార్తీక మాసం
అంశుమంతుడు – మార్గశిర మాసం
భగుడు – పుష్య మాసం
పూషా – మాఘ మాసం
పర్జన్యుడు – ఫాల్గుణ మాసం