అత్తిరాల పరశురాముడి గురించి తెలుసా?

పరశురాముడు సత్యయుగంలో శ్రీమన్నారాయణుడి అవతారం. పరశురాముడు భూమిపై పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టించాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇరవై ఒక్కసార్లు రక్తపాతం జరపడంతో ఆయనకు పాపం చుట్టుకుని తత్ఫలితంగా గొడ్డలి ఆయన హస్తానికి అంటుకొని రాలేదు. మహేశ్వరుడికి మొరపెట్టుకుంటే పుణ్య నదుల్లో స్నానం చేయమని పరశురాముడికి సలహా ఇచ్చాడు. దీంతో పుణ్య క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ అక్కడి పుణ్య నదుల్లో స్నానం మాచరిస్తూ తిరిగాడు. చివరకు పరశురాముడు అత్తిరాల ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడి బహుదా నదిలో స్నానమాచరించగానే చేతికి ఉన్న గొడ్డలి కింద పడిపోయింది.

ఈ విధంగా పరశురామునికి చుట్టుకున్న హత్యపాపం నుంచి విముక్తి కలిగింది. అనంతరం ఆ ప్రాంతానికి ‘హత్యరాల’ అనే పేరొచ్చింది. కాలక్రమంలో ఇప్పుడు ‘అత్తిరాల’గా పిలవబడుతోంది. అక్కడ పరశురాముడి ఆలయాన్ని నిర్మించారు. పూర్వం ద్వాపరయుగంలో శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు అత్తిరాల ప్రాంతంలో నివసిస్తుండేవారు. వీరిద్దరూ సకల విద్యలలో ఆరితేరిపోయారు. వీరిద్దరూ ఆశ్రమాలను స్థాపించుకుని, అక్కడే తపస్సు చేసుకునేవారు. ఒకరోజు శఖుండిని చూడటం కోసం లిఖితుడు అతని ఆశ్రమానికి వెళ్లాడు.

అప్పుడు శంఖుడు లేకపోవడంతో సరదాగా అక్కడి చెట్లకు ఉన్న ఫలాలను కోసుకుని తినసాగాడు. అది చూసిన శంఖుడు ఎవరి అనుమతితో ఫలాలను తింటున్నావని ప్రశ్నించాడు. వెంటనే లిఖితుడు తన తప్పుకు పరిహారం చూపమని అడగ్గా.. సుదుమ్న్య రాజు దగ్గరకు వెళ్లి శిక్షను అనుభవించమంటాడు. రాజు లిఖితుని చేతులు నరకమని ఆదేశిస్తాడు. ఆ తరువాత శంఖుడి సలహా మేరకు నదిలో మునుగుతాడు. బయటకు వచ్చాక చూస్తే తన చేతులు తిరిగి వస్తాయి. అలా లిఖితునికి చేతులు ప్రసాదించినందుకు ‘బాహుదా’ నది అని అనంతరం ఇప్పుడు చెయ్యేరుగా పిలవబడుతోంది.

Share this post with your friends