చాతుర్మాస దీక్ష గురించి తెలుసా? యోగ నిద్రలోకి విష్ణుమూర్తి..

ఆషాఢ మాసం వచ్చేసింది.. ఈ మాసంలో చాతుర్మాస్య దీక్షను చాలా మంది ప్రారంభిస్తూ ఉంటారు. దీని గురించి చాలా మంది విని ఉంటారు కానీ దీనికి సంబంధించిన వివరాలు తెలియవు. ఆషాడ మాసం లోని దేవ శయన ఏకాదశినాడు ఈ చాతుర్మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలోని ఉత్థాన ఏకాదశి నాడు ముగుస్తుంది. నాలుగు నెలల పాటు సాగే ఈ మాసాన్ని హిందువులు చాలా పవిత్రంగా భావిస్తుంటారు. ఈ చాతుర్మాస కాలంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి జారుకుంటారట. ఆయన నాలుగు నెలల పాటు ఆయన నిద్రిస్తూనే ఉంటారట. ఈ దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కొంటాడు.

ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టారు. ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుంచి మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీనిని అర్ధచాతుర్మాస్యం అనే పేరుతో పిలుస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ, పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మొదలైన వారెవరైనా చేయవచ్చును. ఈ చాతుర్మాస దీక్షను హిందువులతో పాటు జైన, బౌద్ధ మతస్థులు సైతం ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గానీ, వీలుకాకపోతే కటక సంక్రాంతి, కాకపొతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలని చెప్తారు.

Share this post with your friends