తిరుమలకు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లేవారు ఈ విషయం తెలుసుకోండి..

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారనడంలో సందేహం లేదు. పది రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు వైకుంఠ ద్వార దర్శన అవకాశం కల్పించనుంది. ఇప్పటికే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు కీలక సూచనలను సైతం చేసింది. తాజాగా మరో సూచన కూడా చేసింది. ఇప్పటి వరకూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి నిర్దేశిత సమయం కంటే ముందుగానే భక్తులు దర్శనానికి వెళుతుంటారు. అయితే వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు ఇలా ముందుగా దర్శనానికి వెళ్లడానికి వీలు పడదు.

పది రోజుల వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి తిరుపతిలో జారీ చేయనున్న ఎస్ఎస్ డీ టోకెన్లు పొందాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వైకుంఠ ఏకాదశికి అధికారులు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోందన్నారు.

Share this post with your friends