నేటితో ముగియనున్న భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు

ఏటా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. మధ్యలో సీతారాముల కల్యాణం, మరుసటి రోజున శ్రీరామ పట్టాభిషేకం వంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి కల్యాణానికి హాజరయ్యారు. నేడు స్వామివారికి చక్రతీర్థం, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణలు, శేషవాహన సేవ, ధ్వజారోహనం, శ్రీ పుష్పయాగం వంటి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

ఏప్రిల్ 13 నుంచి చూస్తే.. మండల లేఖన, కుండ, కలశ, యాగశాల, అలంకరణాదులు, సార్వభౌమ వాహన సేవ.. 14న గరుడ ధ్వజపట లేఖనం, ఆవిష్కరణ, గరుడాధివాసం, 15న అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీతాడనం, దేవతాహ్వానం, బలిసమర్పణం, హనుమంత వాహన సేవ, 16న యాగశాల పూజ, చతు:స్థానార్చన, ఎదుర్కోలు, 17న శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం, శ్రీరామపునర్వసు దీక్షా ప్రారంభం, 18న మహాపట్టాభిషేకం, 19న మహదాశీర్వచనం, 20న తెప్పోత్సవం, డోలోత్సవం, 21న ఊంజల్సేవ, 22న వసంతోత్సవం వంటివి జరిగాయి. అయితే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి నిత్య కల్యాణం సహా కొన్ని సేవలను భద్రాద్రి ఆలయ అధికారులు రద్దు చేశారు. వీటన్నింటినీ రేపటి నుంచి పునరుద్ధరించనున్నారు.

Share this post with your friends