హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజనేయస్వామి జన్మ స్థలమైన ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయస్వామివారికి అర్చకులు ఇవాళ ఎర్రగన్నేరు, కనకాంబరాలతో అర్చన నిర్వహించనున్నారు. ఆదివారం ఏకాదశి సందర్భంగా నాగవల్లి దళార్చన (తమలపాకులతో) విశేష సహస్రనామార్చనను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ వైఖానస ఆగమసలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, హనుమంతుని విశిష్టత, ఆకాశగంగలోని శ్రీ బాల ఆంజనేయస్వామి విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి పంచామృత స్నపన తిరుమంజనం జరిగింది. తమలపాకులతో సహస్రనామ అర్చన నిర్వహించారు.
శ్రీ ఆంజనేయస్వామి జన్మ స్థలమైన ఆకాశగంగలో వందల సంవత్సరాల క్రితం నుంచి శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయస్వామివారు వెలసి ఉన్నారని, హనుమత్ జయంతి సందర్భంగా విశేష అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆకాశగంగలోని బాలాంజనేయస్వామి ఆలయంలో జూన్ ఒకటి స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జూన్ 5 వరకూ ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల వరకూ అభిషేకం చేయనున్నారు. 5వ తేదీన సింధూరం అభిషేకంతో స్వామివారి జయంతి వేడుకలు ముగియనున్నాయి.