హనుమంతుడు అంజనాద్రి ఆకాశగంగలో జన్మించినట్లు రాయల్ చెరువు శక్తి పీఠం మాతృశ్రీ రమ్యానంద భారతి పేర్కొన్నారు. హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తిరుమలలోని నాదనీరాజనం, ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మాతృశ్రీ రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం చేస్తూ, అంజనాదేవికి వాయుదేవుని వలన తాను జన్మించినట్లు హనుమంతుడు సీతాదేవికి తెలిపారని వెల్లడించారు.
మతంగ మహర్షి చెప్పిన విధంగా అంజనాదేవి వేంకటాచలానికి విచ్చేసి అక్కడ తపస్సు చేసుకోవడం జరిగిందన్నారు. అనంతరం ఆంజనేయస్వామికి జన్మనివ్వడం, తదనుగుణంగా ఆ కొండకు ‘అంజనాద్రి’ అని పేరు వచ్చిందని రమ్యానంద భారతి తెలిపారు. బాలాంజనేయస్వామి సూర్యదేవుని పట్టుకోవడానికి వేంకటాద్రి నుంచి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో భాగంగా తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మరల చూడడం, వానరవీరులు వైకుంఠ గుహలో ప్రవేశించడం.. ఇలా అనేక విషయాలు వేంకటాచల మాహాత్మ్యం వల్ల తెలుస్తున్నాయని రమ్యానంద భారతి వివరించారు.