తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగావున్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో శనివారం హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణస్వామి ఉత్సవమూర్తులను శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయానికి వేంచేపు చేశారు. శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీసీతారామ, లక్ష్మణ స్వామివార్ల ఉత్సవర్లకు వైభవంగా అభిషేకం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీ రామచంద్రమూర్తి హనుమంత వాహనంపై స్వామివారు విహరించారు.
హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. దాస్యభక్తికి ప్రతీకగా శ్రీరాములవారు హనుమంత వాహనంపై విహరిస్తారు. ఇక జపాలిలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకూ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం జరగనుంది. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంకీర్తనలు నిర్వహించనున్నారు. ఆకాశగంగలోని బాలాంజనేయస్వామి ఆలయంలో జూన్ ఒకటి నుంచి జూన్ 5 వరకూ ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. ఇవాళ స్వామివారికి తమలపాకులతో అభిషేకం నిర్వహించనున్నారు.