సంతానం లేని వారు గుడులూ.. గోపురాలూ తిరగడం సహజం. అయితే అన్ని ఆలయాలకు వెళితే తమ కోరిక నెరవేరుతుందో లేదో కానీ ఈ 500 ఏళ్ల నాటి ఆలయానికి వెళితే మాత్రం సంతాన భాగ్యం తప్పక లభిస్తుందట. ఆ ఆలయమేంటి? ఎక్కడుంది? దాని కథా కమామీషు చూద్దాం. ఈ ఆలయం పలమనేరు పట్టణంలోని పాఠపేట వీధిలో ఉంది. ఇది వేణుగోపాల స్వామి ఆలయం. సంతానాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి సంతాన వేణుగోపాల స్వామి అని భక్తులు పిలుచుకుంటారు. ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారు. అప్పట్లో పల్లవులు ఏనుగులపై వచ్చి స్వామివారికి పూజలు చేసేవారట. బ్రిటీష్ వారి రాకానంతరం ఆలయం కొంత శిథిలావస్థకు చేరగా.. అప్పటి ప్రజలు పునర్నిర్మాణానికి యత్నించారట.
ఎందుకోగానీ ఆ పనులు ముందుకు జరగలేదట. ఆ తరువాత కొంతకాలానికి రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ పరుశారాం, ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయట. వీరికి స్థానిక ప్రజలు సహకారంతో పాటు ఎండోమెంట్ వారి రూ.15 లక్షలు వరకు ఆర్థిక సాయం అందించారు. మొత్తంగా కోటి ఇరవై లక్షల రూపాయలతో ఆలయం అందంగా ముస్తాబైంది. ప్రస్తుతం ఇక్కడ ప్రతి రోజూ స్వామివారికి పూజలు జరుగుతున్నాయి. సంతానం లేని వారు ఈ ఆలయాన్ని దర్శించుకుని భక్తితో స్వామివారికి మొక్కి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలు తప్పక సంతాన భాగ్యం కలుగుతుందట. దాదాపు ఆలయాన్ని దర్శించుకున్న వారందరికీ సంతాన భాగ్యం కలగడంతో ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.