శివుడి శిరస్సుపై గంగ, చంద్రుడు ఎందుకున్నారో తెలుసా?

పరమేశ్వరుడు, గరళ కంఠుడు, భోళా శంకరుడు, సాంబుడు అంటూ శివుడికి ఎన్నో పేర్లొచ్చాయి. నిత్యం లోక కల్యాణం కోసం శ్రమించే పరమ దయాళువు మన శివయ్య. కష్టాలే రానీ.. నష్టాలే రానీ విశ్వ రక్షణకు వెనుకడుగు వేయడు. అయితే పరమ శివుడిపై గంగ ఎందుకుంటుందనేది చాలా మందికే తెలిసే ఉండొచ్చు కానీ చందమామ ఎందుకు ఉన్నట్టు? దీనికి చాలా పెద్ద కథే ఉంది. అమృతం కోసం దేవ, దానవులు కలిసి మందర పర్వతాన్ని వాసుకిని కవ్వంలా చేసుకుని మధించిన కథ తెలిసే ఉంటుంది. ఇలా మధిస్తుండగా.. పర్వతం కొంత మేర లోపలికి కుంగి పోయిందట. వెంటనే విష్ణుమూర్తి కూర్మ రూపం దాల్చి పర్వతం కుంగిపోకుండా అడ్డుకున్నాడు.

ఆ సమయంలో అమృతానికి ముందు హాలాహలం ఉద్భవించిందట. విపరీతమైన వేడి.. ప్రళయాగ్ని ఆ మంటలను భరించడం అక్కడున్న వారందరి వల్లా కాలేదట. ఆ సమయంలో శివుడికి బ్రహ్మ విషయాన్ని అనంతశయుడికి వివరించడంతో ఆ ప్రళయాగ్నిని భరించే శక్తి పరమేశ్వరుడికి ఒక్కడికే ఉందని ఆయనను శరణు వేడాలని సూచించారట. వెంటనే బ్రహ్మాది దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్లారట. విషయం తెలుసుకున్న శివుడు ఆ హాలాహలాన్నంతా ముద్దలా చేసి గొంతులో దాచుకుని గరళకంఠుడు అయ్యాడు. ఇక ఆ వేడికి శివుని శరీరం మొత్తం నల్లగా మారడం ఆరంభమైంది. దీన్ని గమనించిన బ్రహ్మ చంద్రుని పిలిచి శివుని జటాజూటములో ఉండమని చెప్పాడు. చంద్రుడి చల్లదనానికి శివుడిలోని వేడి తగ్గుతుందని.. అయితే కొంత మేర తగ్గిందట కానీ పూర్తిగా అయితే కాదట. అప్పుడు బ్రహ్మ గంగను పిలిచి శివుని శిరస్సుపై ఉండి నిత్యం నీటితో అభిషేకం చేయాలని కోరాడట. అలా గంగ కూడా శివుని సరస్సుపై చేరింది. దీంతో గంగాధరుడిగా శివుడు మారిపోయాడు.

Share this post with your friends