హనుమాన్ ఆలయాలకు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఓ ఆలయంలో స్వామివారు స్త్రీ రూపంలో మనకు దర్శనమిస్తారు. కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఛత్తీస్‌గడ్‌లోని రతన్‌పూర్ జిల్లాలో గిర్జబంద్‌లో ఈ ఆలయం ఉంది. రతన్ పూర్ రాజైన పృధ్వీరాజ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని హనుమంతుడు సీతారాములను భూజాలపై మోస్తున్నట్టుగా కనిపిస్తాడు. హనుమంతుడిని నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించే పృధ్వీదేవ్‌కి కుష్టు వ్యాధి సోకిందట. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారట. ఒకరోజు ఆంజనేయస్వామి కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని చెప్పారట.
హనుమంతుడి ఆదేశానుసారం పృధ్వీదేవ్ ఆలయ నిర్మాణాన్ని మొదలు పెట్టారట. ఆలయం పూర్తి కావడానికి వస్తుండగా పృధ్వీ దేవ్‌కి హనుమంతుడు మళ్లీ కలలో కనిపించాడట. మహామాయ కుండ్ వద్ద ఓ విగ్రహం ఉందని.. దానిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్టించాలని చెప్పారట. వెంటనే పృధ్వీదేవ్ హనుమంతుడు చెప్పిన ప్రదేశానికి వెళ్లగా అక్కడ హనుమాన్ విగ్రహం స్త్రీ రూపంలో దర్శనమిచ్చిందట. ఒకింత ఆశ్చర్యపోయిన రాజు.. స్వామివారి ఆదేశానుసారం ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్టించారట. అంతే ఆయన కుష్టు వ్యాధి నయమై పోయిందట. అప్పటి నుంచి అక్కడి హనుమంతుడు కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా విరాజిల్లుతున్నాడు.