నల్గొండ జిల్లాలో వున్న అతి పురాతనమైన ఆలయాల్లో చెరువుగట్టు జడల రామలింగేశ్వరస్వామి ఆలయం చాలా ప్రఖ్యాతి గాంచింది. ఇది నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని స్థల పురాణం ఏంటంటే.. పూర్వం ఒకరోజు హైహయ వంశ చక్రవర్తి అయిన కార్త వీర్యార్జున సపరివారంగా వేటకోసం దండకారణ్యానికి వెళ్లాడు. వేట అనంతరం సైన్యంతో కలిసి సమీపంలోనే ఉన్న జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. వీరందరికీ జమదగ్ని మహర్షి తన దగ్గరున్న ధేనువు సాయంతో క్షణాల్లో భోజనం ఏర్పాటు చేశాడు. ధేనువు మహత్యాన్ని కళ్లారా చూసిన కార్తవీర్యార్జనుడు తనకు ఆ ధేనువు కావాలని అడగ్గా మహర్షి నిరాకరిస్తాడు.
కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జనుడు జమదగ్ని ఆశ్రమాన్ని నాశనం చేసి ధేనువును తీసుకెళతాడు. విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహం పట్టలేక కార్తవీర్యార్జనుడితో పాటు ఇరవై ఒక్క సార్లు భూ ప్రదక్షిణలు చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. ఆ తరువాత పాప పరిహార్థంగా దేశం నలుమూలలా108 శివలింగాలను ప్రతిష్టించాడు. ఈ క్రమంలో పరశురాముడు ప్రతిష్టించిన చిట్ట చివరి.. 108వ శివలింగమే చెరువుగట్టు క్షేత్రంలో ఉన్న జడల రామలింగేశ్వరుడు. అఅయితే ఇక్కడ ఎంతకాలం పరశురాముడు తపస్సు చేసినా శివుడు ప్రత్యక్ష్యం కాలేదట. కోపంతో తన వద్దనున్న గొడ్డలితో శివలింగం ఊర్థ్వభాగంపై ఒక దెబ్బ వేయగా.. శివుడు ప్రత్యక్షమై.. పరశురాముడు ఇంతకాలం తపస్సు చేసిన ఈ ప్రాంతం ప్రముఖ శైవక్షేత్రంగా వర్థిల్లుతుందని చెప్పాడట. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివునిలో ఐక్యమైనట్టు స్థల పురాణం చెబుతోంది.