అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఆలయాల చుట్టూ ప్రాకారం నిర్మాణంతో పాటు ఒక రాజగోపురం, మూడు గోపురాలు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలుస్తారు. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని విస్తరణ పనులతో పాటు సుందరంగా తీర్చిదిద్దనున్నారు. కరీంనగర్, కొడంగల్, నవీ ముంబై, బాంద్రా, ఉలుందుర్పేట, కొయంబత్తూరులో చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణం-అభివృద్ధి కార్యక్రమాలపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జే ఈ వో వీరబ్రహ్మం ,చీఫ్ విజిలెన్స్ అధికారి, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో తిరుమలలో టీటీడీ అందించిన సేవలపై ఫీడ్‌బ్యాక్ సర్వేలో భక్తుల నుంచి అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. రథసప్తమి రోజున భక్తుల రద్దీ క్రమబద్దీకరణ, అన్నప్రసాదం, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అన్ని అంశాలపై 76 శాతం మంది భక్తులు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పగా, మరో 22 శాతం మంది బావున్నట్టు వెల్లడించారు. కేవలం 1 శాతం పర్వాలేదని, 1 శాతం మంది మాత్రమే బాగోలేదని తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు 74 శాతం మంది భక్తులు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పగా, మరో 22 శాతం మంది బావున్నట్టు వెల్లడించారు. కేవలం 3 శాతం పర్వాలేదని, 1 శాతం మంది మాత్రమే బాగోలేదని తెలిపారు. మార్చి 9 నుంచి 14 వరకు సాధారణ రోజుల్లో తిరుమల వచ్చిన భక్తుల నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో చేసిన సర్వేలోనూ అత్యధిక స్థాయి సంతృప్తి వ్యక్తమైంది. క్యూలైన్ నిర్వహణ, సౌకర్యాలపై 65 శాతం మంది బాగుంది అని చెప్పగా, 28శాతం పర్వాలేదని, 7 శాతం మంది బాగోలేదని సమాధానం ఇచ్చారు. అలాగే వసతి, శుభ్రత బాగుందని 74 శాతం, పర్వాలేదని 19 శాతం, బాగోలేదని 7 శాతం మంది చెప్పారు. లడ్డు రుచి-నాణ్యత బావుందని 77 శాతం, పర్వాలేదని 17 శాతం, బాగోలేదని 6 శాతం మంది చెప్పారు. ఇంకా అన్నదానం, కల్యాణకట్ట, టీటీడీ ఉద్యోగుల ప్రవర్తన, లగేజ్ కలెక్షన్-డెలివరీ వంటి అంశాలపైనా ఇదే స్థాయిలో అభిప్రాయాలు వెల్లడించారు. మొత్తంగా ఐవీఆర్‌ఎస్ సర్వేలో 61 శాతం మంది భక్తులు టీటీడీ సేవలు బావున్నాయని మెచ్చుకున్నారు. 27 శాతం పర్వాలేదన్నారు. 12 శాతం మంది భక్తులు బాగోలేదన్నారు.