శ్రీరామ రాజ్యాన్ని మళ్ళీ స్థాపించాలనే తపన తనదని, ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన నీతి, ధర్మ మార్గాన్ని అనుసరించి జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ సీతా రామ కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత సీఎం మాట్లాడారు. ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించడం ప్రతి ఒక్కరికీ అదృష్టంగా పేర్కొన్నారు. శ్రీరాముడు ఒక వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, తండ్రి ఆజ్ఞను ఎలా విధిగా పాటించాలో, కుటుంబ బంధాలను ఎలా పరిపూర్ణంగా పోషించాలో తెలియజేశారని సీఎం అన్నారు.
“తిరుమలలో గోవింద నామం ప్రతిధ్వనిస్తున్న విధంగా, ఒంటిమిట్టలో ‘జై శ్రీరామ్’ నినాదమే మిన్నగా వినిపించాలి. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను ప్రధాన పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ఈ ఆలయాన్ని దశాబ్ద కాలం క్రితమే టిటిడికి ఇవ్వడమైనదన్నారు. “ఈ సంతోషకరమైన సందర్భంగా, తిరుమల మాదిరిగా ఒంటిమిట్టలో కూడా అన్నప్రసాదం ప్రారంభించాలన్న నిశ్చయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీసుకోవాలని కోరారు. ఒంటిమిట్టను పుణ్యభూమిగా మార్చేందుకు ఇక్కడి కొండలపై ఆయుర్వేద మొక్కలను నాటనున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఒంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
తర్వాత టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో అన్నప్రసాదం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.