ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగ శాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.