వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. తెప్పోత్సవాల నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకూ శ్రీరామచంద్ర పుష్కరిణిలో ఈ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇక సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారు మొదటి రోజు ఐదు చుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరి రోజు తొమ్మిది చుట్లు స్వామివారు తెప్పలపై విహరించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 9 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.

Share this post with your friends