శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. విద్యుత్ కాంతుల‌తో మెరిసిన ఆలయం

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం మార్చి 3 నుంచి అంటే నేటి నుంచి మార్చి 16 వరకు జరగనుంది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తీశ్వరాలయం వేదికైంది. ఆలయం విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు విశేషం. ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం 13 రోజుల పాటు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పదమూడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో వాహన సేవా కార్యక్రమం ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఇప్పటికే రంగవల్లికలతో సుందరంగా అలంకరించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వాహనసేవలను చూసి ముక్తిని కోరుకుంటారు. అందుకోసం వేల సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు.

తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా భజనమండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనసేవలో విహరిస్తున్న స్వామికి అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్‌ భూపతి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రవికుమార్‌, బాలకృష్ణ పాల్గొన్నారు. మరోవైపు శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మూడో రోజు రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి శ్రీనివాస సమేతంగా బకాసుర వద అలంకారంలో ముత్యాల పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ ఉత్సవాలు గజరాజులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామిని కీర్తించారు. వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.

Share this post with your friends